రథ సప్తమి విశిష్టత చేయవలసిన విధులు


 

🌺 రథ సప్తమి 

ఈరోజు అనగా తేదీ 25 జనవరి 2026 రథసప్తమి.

ఆదివారం మరియు మాఘ శుద్ధ సప్తమి రెండూ కలిసివచ్చిన శుభసమయం. 
సాధారణంగా ఏ నెలలో అయినా సప్తమి ఆదివారం కలిసి వస్తే ఆ రోజును భాను సప్తమిగా పిలుస్తారు. అది కూడా మాఘమాసంలో, శుక్లపక్షంలో సప్తమి ఆదివారం కలిసి వస్తే అది చాలా విశిష్టమైన పర్వదినం.

సూర్యభగవానుడు అదితి, కశ్యప మహర్షులకు జన్మించిన రోజుగా, సూర్యజయంతిగా రథసప్తమిని పరిగణిస్తారు.

సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించే రోజు గా భావిస్తు చిక్కుడు కాయలతో రథాన్ని చేసి పూజిస్తారు భక్తులు.

సూర్యుడిని ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

ఈరోజు సూర్యోదయానికి ముందరే
స్నానాదులు పూర్తిచేసి, ఆదిత్య హృదయం చదవడం, గాయత్రీ జపం చేయడం, రాగిపాత్రతో అర్ఘ్యం సమర్పించడం, ఆవు పిడకలపై పరమాన్నాన్ని వండి నైవేద్యం పెట్టడం మొదలైనవి చేయడం వలన ఆస్వామి అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. 

ఈ రోజు చేసే స్నానం, జపం మరియు దానం సూర్య గ్రహణ సమయంలో చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 

🌺 రథసప్తమి స్నాన విశిష్టత
పాప విముక్తి: రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు, దోషాలు మరియు దరిద్రాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ఆరోగ్య ప్రదాయిని: ఈ రోజును "ఆరోగ్య సప్తమి" అని కూడా పిలుస్తారు. జిల్లేడు ఆకులను (అర్క పత్రాలు) తలపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుందని, చర్మ వ్యాధులు మరియు నొప్పులు ఉపశమిస్తాయని చెబుతారు.

సౌర శక్తి: జిల్లేడు ఆకులకు సూర్యరశ్మిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. స్నానం సమయంలో ఈ ఆకులను ధరించడం వల్ల సూర్యుడి నుండి వెలువడే దివ్యమైన శక్తి శరీరానికి అందుతుంది.

శుభ సమయం: రథసప్తమి నాడు అరుణోదయ కాలంలో (సూర్యోదయానికి సుమారు 96 నిమిషాల ముందు) చేసే స్నానం అత్యంత ఉత్తమమైనది.

🌺 స్నాన విధానం:
ఆకుల అమరిక: పురుషులు మరియు స్త్రీలు తమ తల మీద 7 జిల్లేడు ఆకులను (అర్క పత్రాలు) ఉంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో తలపై ఒక జిల్లేడు ఆకు, రెండు భుజాలపై రెండు, రెండు మోకాళ్లపై రెండు, రెండు పాదాలపై రెండు చొప్పున మొత్తం 7 ఆకులను పెడతారు.

రేగు పండ్లు: జిల్లేడు ఆకులతో పాటు రేగు పండ్లను కూడా తలపై ఉంచుకోవడం సంప్రదాయం.

స్నానం: నదిలో లేదా ఇంట్లో సూర్యుడికి అభిముఖంగా నిలబడి, కింది మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. 

🌺 రథసప్తమి స్నాన మంత్రం:
స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి:

 "యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు| 
 తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||"

అర్థం: "గత ఏడు జన్మలలో నేను చేసిన పాపాలను, నా రోగాలను, శోకాలను ఈ మాఘ సప్తమి (రథసప్తమి) స్నానం తొలగించు గాక."

ముఖ్యమైన సూచనలు:

స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం (నీటిని సమర్పించడం) వదలాలి.

ఈ రోజు సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం మంచిది. 

ఈరోజు ఆరుబయట పెరటిలో ఆవు పికలపై పరమాన్నం వండి, చిక్కుడుకాయలతో రథం చేసి, సూర్యనారాయణ మూర్తిని పూజించి నైవేద్యం పెట్టాలి.


 🌺 శ్రీ ఆదిత్య (సూర్య) ద్వాదశ నామ స్తోత్రమ్ 

ఆదిత్యః ప్రథమం నామం ద్వితీయం తు దివాకరః ।
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః ॥ 1 ॥

పఞ్చమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః ।
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః ॥ 2 ॥

నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః ।
ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ ॥ 3 ॥

ద్వాదశాదిత్యనామాని ప్రాతః కాలే పఠేన్నరః ।
దుఃస్వప్నో నశ్యతే తస్య సర్వదుఃఖం చ నశ్యతి ॥ 4 ॥

దద్రుకుష్ఠహరం చైవ దారిద్ర్యం హరతే ధ్రువమ్ ।
సర్వతీర్థకరం చైవ సర్వకామఫలప్రదమ్ ॥ 5 ॥

యః పఠేత్ ప్రాతరుత్థాయ భక్త్యా స్తోత్రమిదం నరః ।
సౌఖ్యమాయుస్తథారోగ్యం లభతే మోక్షమేవ చ ॥ 6 ॥

ఇతి శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రమ్ ।

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

🌺 యామము అంటే..

నరక చతుర్దశి కార్యాకార్యములు

ఇంజనీరింగ్ లేక లా చదువు - జాతకం ప్రకారం ఏది?