🌸 గ్రహములు దీప్తాది అవస్థలు-తత్ఫలములు
శ్లో। దీప్తస్స్వస్థో ముదిత శ్శాన్త శ్శక్తో నిపీడితో భీతః !
వికలః ఖలశ్చ కథితో నవప్రకారో గ్రహోహరినా ॥ - సారావళీ
దీప్తము, స్వస్థము, ముదితము, శాంతము, శక్తము, నిపీడితము, భీతము, వికలము, ఖలము అని రవ్యాది గ్రహములు తొమ్మిది విధములైన అవస్థలలో ఏదో ఒక అవస్థ పొందుచుందురు.
శ్లో॥ స్వోచ్చే భవతిచ దీప్త స్స్వస్థస్స్వగృహే సుహృద్గృహే ముదితః |
శాంతశ్శుభవర్గస్థ శ్శక్త స్స్ఫుటకిరణజాలశ్చ।
శ్లో ॥ వికలో రవిలుప్తకరో గ్రహాభిభూతో నిపీడితశ్చైవం |
పాపగణస్థశ్చఖలో నీచే భీత స్సమాఖ్యాతః ॥- సారావళీ
ఉచ్ఛయందున్న గ్రహముదీప్తావస్థ, స్వక్షేత్ర మందున్నచో స్వస్థావస్థ, మిత్రక్షేత్ర మందున్న ముదిత, శుభవర్గ యందున్న గ్రహము శాంతావస్థ, సూర్యునకు దూరములో ఉన్నచో శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమందు పరాజయము పొందిన వాడు పీడితుడుగను, పాపగ్రహములచే వేధింపబడువాడును, పాపవర్గము లందున్నట్టివాడును, ఖలుడుగను, నీచపొందినవాడు భీతుడుగను చెప్పబడుదురు.
🌸 గ్రహ అవస్థా ఫలములు
దీప్తావస్థ (ఉచ్చ) యందున్న గ్రహము యొక్క దశలో కీర్తియు, సకల సంపదలు కలుగును.
స్వస్థావస్థ (స్వక్షేత్ర) యందున్న గ్రహముయొక్క దశాకాలములో ధనము, రత్నములు, భోగములు, సేవకులు కలిగి, రాజుగాని సేనాధిపతిగాని యగును.
ముదితావస్థ (మిత్ర) యందున్న గ్రహముయొక్క దశలో ధనము భోగములు, రాజ యోగము కలుగును.
శాంతావస్థ (శుభ వర్గ) యందున్న గ్రహముయొక్క దశలో శాంతము, సుఖము, భోగములు, ఐశ్వర్యము, విద్వాంసుడు, పరోపకారి, ధర్మపరుడు కలుగును.
శక్తావస్థ (సూర్యుని కి దూరంలో) యందున్న గ్రహము దశలో సకలభోగములు అనుభవించువాడును, కీర్తిని పొందువాడును అగును.
పీడితావస్థ (యుద్ధంలో ఓటమి) యందున్న గ్రహము దశలో - దుఃఖము, రోగము, శత్రువుల చే బాధలు పడుచు, బంధువుల నెడబాసి ఏకాకియై దేశదిమ్మరియై తిరుగుచుండును.
భీతావస్థ(నీచ) ను పొందిన గ్రహము దశలో రాజైనను సకలమును పోగొట్టుకొని మిక్కిలి దరిద్రావస్థకు లోనగును.
వికలావస్థ(అస్తంగత్వం) యందున్న గ్రహము దశలో స్వస్థానము వదలి నానావిధ కష్టము లనుభవించును.
ఖలావస్థ(పాపవర్గం)ను పొందిన గ్రహముయొక్క దశలో సకలైశ్వర్యములు కోల్పోయి, మతిచెడి, కుటుంబమును పోషించ లేక దుఃఖములతో బాధలు పడును.
గ్రహములు ఉచ్ఛరాశి యందున్నను, వక్రించి యున్నను సంపూర్ణబలము కలిగియుండును. అట్టి గ్రహము సంపూర్ణ శుభఫలముల నిచ్చుచుండును.
గ్రహము స్వోచ్చయందున్న పూర్ణబలముతోను, స్వక్షేత్ర - మూల త్రికోణముల యందున్న మధ్యమ బలముతోను యుండును. మిత్రగ్రహములతో కలిసియున్నను, చూడ బడినను, మిత్ర రాశులయందున్నను సామాన్య బలయుతమై యుండును
మీ
R విజయ్ శర్మ
పురోహితులు, జ్యోతిష్యులు
Cell NO: 9000532563
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి