🌺 అశౌచ సమయే వివాహ విషయః
నిశ్చితార్థం అయిన తర్వాత తల్లిదండ్రుల మరణం సంభవిస్తే వివాహం చేయవచ్చా? సంవత్సర సూతకంలో వివాహం చేయవచ్చా? ఎప్పుడు చేయాలి?
॥శ్లో॥ పితుర్మాతుశ్చ పత్న్యాశ్చ వర్షమర్ధంతదర్ధకమ్।
సుతభ్రాత్రోస్సార్ధ మాసమన్యేషామ్మాససమ్మితమ్।।
తదన్తే శాన్తింకృత్వా యథోక్తవిధినాతతః। పునశ్చైవాథవాగ్దానం కృత్వాలగ్నం విధీయతే।।
వివాహమునకు నిశ్చితార్థం అయిన తర్వాత తండ్రి మృతినొందిన ఎడల సంవత్సరము, తల్లి మృతికి ఆరుమాసములు, భార్య మృతికి మూడు మాసములు, కుమారుడు-సోదరుడు మృతినొందిన 45 దినములు ఆగి తరువాత *వినాయకశాంతి* చేసి తిరిగి వాగ్దానము-నిశ్చితార్థము చేసి, సుముహూర్తము నిశ్చయించి, వివాహము చేయవలెను.
శ్లో॥ అన్యేషాం సపిండానాం మాసమేకముదాహృతమ్।
ఉక్తకాలావధిర్యావత్తావన్నైవ శుభక్రియా॥
సపిండులకు ఒక మాసం అసౌచము ఉంటుంది. పై విధంగా మాతాపిత్రాదులు మృతినొందినప్పుడు, పుత్రాదులకు పైన చెప్పబడినంతకాలము అశౌచము ఉంటుంది, కాబట్టి అంతకాలము శుభ కర్మలు చేయకూడదు.
👉 ఇందులకు అపవాదు
మాతా పితౄణాం ప్రథమాబ్దమధ్యే యద్యుత్సవ స్సోపి శుభం నకుర్యాత్।
ఊనం నకుర్యాద్యదివా విమోకం నైవాబ్దికం యావదధోశుభంచేత్॥
వివాహాది ప్రకుర్వీత యదా మహతిసంకటే।
సపిండీకరణాదూర్ధ్వం మాసికాన్యపకృష్యచ॥
కన్యాశ్చాతికాలశ్చే ద్వరస్యాపి భవేద్యది।
తస్యోద్వాహేనదోషోస్తి తథాచైవోపనాయనే॥
తల్లిదండ్రులు మరణించినప్పుడు సంవత్సరంలోపు శుభ కార్యములు ఉత్సవములు నిర్వహించకూడదు.
వటువుకు ఉపనయన కాలాతిక్రమణమందున్నూ, కన్యకు వివాహ కాలాతిక్రమణమందున్నూ, వరునకు కాలాతిక్రమణ కష్టకాలమందున్నూ, స పిండి కరణము తరువాత రాబోవు మాసికములను అపకర్షచే నాచరించి వివాహ ఉపనయనములను చేయవలయును దోషము లేదు.
పూర్వము కన్యకు ఎనిమిది సంవత్సరాలకే వివాహం చేసేవారు. రజస్వల అయిన తర్వాత వివాహం చేయడం ఉండేది కాదు. కావున అతిక్రమము అంటే ఈ కాలం దాటిపోతుంది అనే సంకోచం ఉన్నప్పుడు పైవిధంగా చేయవచ్చు.
నేటి కాలంలో చేసే వివాహాలు వధూవరులకు 25 సంవత్సరాలు దాటిన తర్వాతే చేస్తున్నారు. కనుక వీటి విషయంలో కాలం అతిక్రమణ అవుతోంది అనే భావన ఉండదు గనుక, అశౌచం ఉన్నంతకాలము వదిలిపెట్టడమే శ్రేయస్కరం.
లేదా పెద్ద ప్రాణ సంకటం కలిగినప్పుడు, సంవత్సరంలోప వివాహం చేయడంలో దోషము లేదు అని భావించవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి