జ్యోతిషానికి పరిమితులు ఉన్నాయా!? Does Astrology have limitations!?
ఆలోచిస్తే జన్మ జాతక విశ్లేషణలో జ్యోతిషానికి పరిమితులు ఉన్నాయనిపిస్తుంది. కొన్ని విషయాలకు లోబడి చెప్పినప్పుడు మాత్రమే జ్యోతిషాంశాలు ఫలిస్తాయి.
జ్యోతిషం కర్మ సిద్ధాంతం అనేవి ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయి. జ్యోతిషంలో జాతకభాగం అనేది కర్మ ఫలాన్ని సూచించేది. ఈ కర్మఫలం అనేది ప్రారబ్ద, సంచిత, ఆగామి అని మూడు రకాలు. ప్రారబ్ద కర్మని అనుభవించి తీర వలసిందే. కానీ సంచిత ఆగామి కర్మలు మనం పుట్టిన తర్వాత చేసిన సత్కర్మాచరణ వలన మార్పు చేసుకోవచ్చు.
పూర్వ జన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే।
తచ్ఛాంతిః ఔషధైః దానైః జపహోమ సురార్చనైః॥
ఒక మనిషి పుట్టిన తర్వాత అతని సత్కర్మ చేత పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని మార్చుకోవచ్చు అనేది నిజమైతే, జన్మ జాతకంలో ఉన్నది ఉన్నట్టుగా జరగదు, జాతకంలో ఉన్నది మనం పుట్టిన తర్వాత చేసిన కర్మ ద్వారా కొంత మార్చుకోవచ్చు అనేది కూడా నిజమే..! ఉదాహరణగా అల్పాయుష్కుడైన మార్కండేయునికి చిరంజీవిత్వం లభించడం అనేది తీసుకోవచ్చు.
ఆ జాతకుడు పుట్టిన తర్వాత అతడు “చేసిన సత్కర్మ ఆచరణ, దుష్కర్మ, సంకల్పశక్తి, ప్రయత్నం, తపన” అనే వాటిని బట్టి అతను పొందవలసిన జాతక ఫలాలలో మార్పులు కలుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ మనకు రూఢిఅవుతుంది.
చాలామంది జ్యోతిష్యం అంటే అదొక అద్భుతమైన మాయ శాస్త్రం అనీ, మనం ఏమీ చెప్పకపోయినా కేవలం పుట్టిన తేదీ వివరాలతో మొత్తం జీవితం చెప్పవచ్చనీ అనుకుంటూ ఉంటారు. కానీ అది సత్యం కాదు, కేవలం పుట్టిన తేదీ వివరాలు చూసి జ్యోతిష్యులు చెప్పే పుట్టుక, చావు, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం అనేవి మనం చెప్పినవి చెప్పినట్టు జరగకపోవచ్చు. అందుకు కారణం ఆవ్యక్తి జన్మించిన తరువాత చేసిన కర్మ, అతను పొందవలసిన ఫలాలలో మార్పుతీసుకురావడమే!
Astrology is limitless, when you work within limits.
జ్యోతిషం అపరిమితమైనది, మీరు పరిమితులకు లోబడి పని చేసినప్పుడు.
🌺జ్యోతిషం పేరు చెప్పి-అనేక రకాల గారడీలు చేస్తారు
నేను కొంతమందిని చూశాను. మద్యం, ధూమపానం ఇత్యాది వ్యసనపరులు - కానీ జ్యోతిషం అనే పేరుతో ముఖం చూసి నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు. అలా చెప్పే దానిలో ఎక్కువశాతం పొగడ్తలు, భయపెట్టే విషయాలు ఉంటాయి. అలా చెప్పించుకోవడం జనాలకు బాగా నచ్చుతూ ఉంటుంది. మీరు ఏగ్రహ యోగం వలన అలా చెప్పారు అంటే, నా ఉపాస్య దైవం అనో ఏదో అనో చెప్తారు.
కొందరు స్త్రీలకు అయితే ఇప్పటికీ పూనకాలు వస్తాయి. ఎంతమంది వస్తే అన్ని సార్లూ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమ్మవారు శరీరంపైకి వస్తుంది మరి వారికి విచిత్రంగా,
కహకావేశ పిహిత కర్ణోపశ్రుతి హేతుభిః। కృతాదేశో న సర్వత్ర ప్రష్టవ్యో న సదైవవిత్॥
ఇంద్రజాలవిద్యతో తమ అసలు శరీరాన్ని మరుగుపరిచి గుప్తరూపంలో ప్రశ్న కర్తయొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని సమాధానం చెప్పేవారు, కర్ణపిశాచి, సిద్ది మొదలైనవానిచే ప్రశ్న మొదలైన అంశాలు చెప్పే జ్యోతిష్కులు అని పేరుగల్గిన వారిని ఎక్కడా ప్రశ్నించగూడదు. ఎందుకంటే వారు దైవజ్ఞులు కారు.
జ్యోతిషమనే పేరుతో లోకంలో చాలా గారడీ విద్యలు ఉన్నాయి. కానీ అవి జ్యోతిష శాస్త్రముకాదు. నేను నా సిక్స్త్ సెన్స్ తో చెప్పాను, నా ఉపాసనా బలంతో చెప్పాను అనేవి జ్యోతిష శాస్త్ర పరిధిలోకి రావు. గ్రహ, రాశీ, భావాదుల మిళితమైన జ్యోతిశ్సాస్త్ర ఆధారంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి